వైసీపీని వీడతానంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. వైసీపీ వీడే ప్రసక్తే లేదని, తాను ఎప్పుడూ పార్టీ మారతానని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతానంటూ ప్రతిపక్ష పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని, అలాంటి ఆలోచన తనకు లేదని తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పయనిస్తానని బాలినేని స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నానని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బాలినేని చెప్పారు. పార్టీ మార్పు ప్రచారంపై ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని, జగన్ కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు. అయితే బాలినేని వైసీపీలో అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడతారనే గత కొంతకాలంగా ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు తనపై జరుగుతున్న ప్రచారాన్ని బాలినేని ఖండించకపోడంతో పార్టీని వీడతారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీంతో ఆ వార్తలకు చెక్ పెట్టేందుకు తొలిసారి బాలినేని స్పందించాల్సి వచ్చింది. అయితే వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన సమయంలో సొంత పార్టీ నేతలపై బాలినేని మీడియా ముందు బాహాటంగా విమర్శలు కురిపించారు. సొంత పార్టీలోని కొంతమంది నేతలు తనపై కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీంతో వైవీ సుబ్బారెడ్డితో ఆయనకు విబేధాలు ఉన్నాయని, ఆయన గురించే మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కొద్దిరోజులుగా వైసీపీలో బాలినేని యాక్టివ్‌గా ఉండటం లేదు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. జిల్లా రాజకీయాల్లో ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన తర్వాత పలుమార్లు సీఎం జగన్‌ను బాలినేని కలిశారు. జగన్‌ను కలిసిన తర్వాత కూడా బాలినేని పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.