వ్యవస్థలను జగన్ భ్రష్టుపట్టించారని , జగన్‌కు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదు అని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఏపీ దుర్భేధ్యమైన దుస్థితిలోకి చేరింది. న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగినది. ఇలాంటి వ్యవస్థలను సైతం మానేజ్ చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్&కో అన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాలతో రాజకీయాలు చేస్తున్నారు. మెడికల్ సీట్లలో రిజర్వేషన్ తొలగించడంపై న్యాయపోరాటం చేస్తా. మెడికల్ సీట్ల రిజర్వేషన్ రద్దు చేస్తూ ఇచ్చిన జీఓపై వైసీపీ మంత్రులను యువత నిలదీయాలి. రేపు అన్ని రాజకీయపార్టీలతో కలిపి పేదవాడికి 3 సెంట్స్, డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇవ్వాలని రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాం. అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఆర్ 5 జోన్లో రైతులకు ఇచ్చిన పట్టాలు చెల్లవని జగన్‌కు తెలుసు. ఆర్ 5 జోన్ పేరుతో 47 వేల మందికి ప్రభుత్వం ఆశపెట్టింది. 3 సెంట్స్ ఉన్న ప్రాంతంలో భూమి ఇచ్చి, డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి తీరాలి. ప్రభుత్వం అలా చేయక పోతే మీ తరపున నేను పోరాటం చేస్తా...సుప్రీంకోర్టుకైన వెళ్లి పోరాటం చేస్తా’’ అని జడ శ్రావణ్ తెలిపారు.