ప్రియాంక పార్లమెంట్ లో ఉండాల్సిన వ్యక్తి అని, అందుకు అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయని ఆమె భర్త రాబర్ట్ వాద్రా మెచ్చుకున్నారు. లోక్ సభ సభ్యత్వానికి ప్రియాంక అన్ని విధాలుగా అర్హురాలని కితాబిచ్చారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ వాద్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అర్హతలు, సామర్థ్యంపై కాంగ్రెస్ పార్టీకి పూర్తి అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. ఈసారి ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భావిస్తున్నట్లు రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీగా పోటీచేసేందుకు ప్రియాంకకు అవకాశం కల్పించాలని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, గౌతమ్ అదానీతో తాను కలిసి ఉన్న ఫొటోలను పార్లమెంట్ లో ప్రదర్శిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను రాబర్ట్ వాద్రా తిప్పికొట్టారు. ఆ ఫొటోలో ఏం తప్పు ఉందని వాద్రా ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటని, ఏదైనా తప్పు చేసుంటే రుజువులు చూపాలని కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు. అలా చేయలేదంటే తనపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాబర్ట్ వాద్రా డిమాండ్ చేశారు.