గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై ఇరుదేశాల మధ్య ఈ మూడేళ్లలో అనేక దఫాలుగా కమాండో కార్ప్స్ చర్చలు జరగడంతో పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. కానీ, ఎటువంటి పరిణామాలు ఎదురైనా ధీటుగా తిప్పికొట్టేలా భారత్, చైనాలు వ్యూహాత్మకంగా బలగాలను మోహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులు, 90 యుద్ధ ట్యాంకులను మోహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలపై డేగ కళ్లతో నిఘా ఉంచి, వారి చర్యలను అడ్డుకోడానికి భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌యూ-30ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను పంపినట్టు పేర్కొన్నాయి. ఇదే సమయంలో 2020 జూన్ 15 నాటి గల్వాన్ ఘటనను దృష్టిలో ఉంచుకున్న రక్షణశాఖ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఎల్‌ఏసీ వెంబడి విపత్కర పరిస్థితుల్లో ఆయుధాలు, బలగాలను మోహరింపునకు వీలులేని ప్రాంతాల్లో తక్షణమే అందుబాటులో ఉండేలా యుద్ధ సామగ్రిని నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేసింది. వ్యూహాత్మక ఎయిర్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది.
ఇటీవల మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘా కోసం పైలట్ రహిత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (RPA)ను కూడా భారత్ మోహరించింది. సరిహద్దు మార్గంలో ప్రయాణిస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దలికల గురించి సమాచారం సేకరించి భారత్ అధికారులకు చేరవేస్తుంది. అవసరమైతే దాడి చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇప్పటివరకు వివిధ బెటాలియన్ల నుంచి 68 వేల మంది సైనికులు, 90కి పైగా యుద్ధ ట్యాంకులు, 330కిపైగా బీఎంపీ ఇన్‌ఫ్రాంటీ కంబాట్ వేహికల్స్‌తోపాటు రాడార్ వ్యవస్థలు, అధునాతన తుపాకీలను కూడా వివాదాస్పద ప్రాంతాల్లో మోహరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
వీటికి మరింత సామర్ధ్యం చేకూర్చేలా వైమానిక దళం సీ-130జే సూపర్ హెర్కులస్, సీ-17 గ్లోబల్‌మాస్టర్ యుద్ధవిమానాలతోపాటు 9వేల టన్నుల ఆయుధ సామగ్రిని సిద్ధం చేసి ఉంచింది. ఎస్‌యూ-30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలు 50 కి.మీ పరిధిలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలవు. అంతేకాకుండా ఆ పరిధిలో చైనా సైన్యం కదలికలను గుర్తించి ఆర్మీకి సమాచారం చేరవేస్తాయని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొని, ప్రత్యర్ధుల కదలికలను గమనించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నాయి.
సైనిక సామర్ధ్యాన్ని పటిష్టం చేయడం, బలగాలను సమర్ధంగా నిర్వహించడం, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి శత్రువుల కదలికలను పర్యవేక్షించడం ఈ వ్యూహమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. చాలా క్లిష్ట పరిస్థితుల్లోనూ పనిచేసిన ఐఏఎఫ్..తన మిషన్ లక్ష్యాలన్నింటిని పూర్తి చేసిందని పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఓ అధికారి చెప్పారు. డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ పరాక్రమ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తక్కువ సమయంలో నియంత్రణ రేఖ వెంబడి భారీ సంఖ్యలో సైనికులను సమీకరించింది. ప్రస్తుతం అప్పటి కంటే ఎంతో మెరుగ్గా ఇండియన్ ఆర్మీ సైనికులను ఎయిర్‌లిఫ్ట్ చేసింది.