దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దళిత వర్గాలకు స్వాతంత్య్రం లభించలేదనిపిస్తోందని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబుతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారు. ‘ప్రభుత్వాలు పెత్తనం చెలాయించే విధానం మారాలి. ప్రజల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం కావాలి. కొన్ని కులాలు, మతాలు, జాతులను ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి మద్దతు పలకాలి’ అన్నారు. గొప్ప విజన్ ఉన్న చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మనమంతా నడుచుకోవాలి. ఆయన అడుగులో అడుగేయాలి. ఆయన మాటకు మద్దతివ్వాలి. ఇండియా విజన్-2047 డాక్యుమెంట్ ఫలితాలు వచ్చే తరాలు అనుభవిస్తాయి అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.