ఏలూరు ప్రభుత్వాస్పత్రి లో ఒక డాక్టర్ నిర్వాకం బయటపడింది. వివరాల్లోకి వెళ్ళితే..... ప్రభుత్వాస్పత్రి కి వారం క్రితం కాన్పు నిమిత్తం ఓ మహిళ వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అయితే కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అప్పటి నుంచి ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించారు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఈ ఎక్స్‌రే ఫొటోను సదరు ఉద్యోగి తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో విషయం బయటపడింది. వెంటనే సంబంధిత ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆయన ఆ పోస్టులను తొలగించాడు. అలాగే ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి కేసు షీట్, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆస్పత్రి ఆవరణలోని ఎక్స్‌రే విభాగంలో తీసిన రికార్డులపై మాత్రం బాధితురాలి పేరు, తేదీతో సహా పలు వివరాలు ఉన్నాయి. ఎక్స్‌రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తుండటంతో వైద్యులు కంగారు పడుతున్నారు. సర్జరీ చేసిన వైద్యురాలిని రక్షించేందుకు గతంలో అక్కడే పనిచేసిన ఓ వైద్య ఉన్నతాధికారి తీవ్రంగా కృషి చేస్తున్నారు.