పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అవును, పెళ్లి అనేది కొత్త తరానికి పునాది. భారతీయ సంప్రదాయంలో పెళ్లిని ఓ పండుగలా జరుపుకుంటారు. ప్రాంతాలు, ఆచారాలను బట్టి మూడు రోజుల నుంచి పదహారు రోజుల వరకూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. బలమైన ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే కాపురాలు సక్రమంగా సాగి.. కుటుంబం సంతోషంగా ఉంటుందనేది నమ్మకం. అందుకే కొందరు మంచి ముహూర్తం కోసం వేచిచూసి.. పెళ్లిళ్లు చేసుకుంటారు. దక్షిణాదిలో చంద్రమానం.. ఉత్తరాదిలో సూర్యమానం అనుసరించి ముహూర్తాలు, శుభకార్యాలను జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో చంద్రమానం ప్రకారం ఆషాడం, అధిక శ్రావణంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల పాటు వివాహాది శుభకార్యాలు జరగలేదు. ఆగస్టు 16న (బుధవారం) అధిక అమావాస్య తర్వాత మళ్లీ శుభ ఘడియలు మొదలవుతున్నాయి. దాదాపు ఐదు నెలల పాటు ఎటువంటి బ్రేక్ ఉండదని జ్యోతిషులు, పంచాంగకర్తలు చెబుతున్నారు. ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు మొదలై... డిసెంబర్ 31 వరకు ఉన్నాయి. ఈ సమయంలో 53 బలమైన ముహూర్తాలు ఉన్నాయని.. గృహప్రవేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన కాలమని అంటున్నారు.
ఆగస్టు నెలలో 19, 20 ,22, 24, 26, 29, 30, 31.. సెప్టెంబరులో 1, 2, 3, 6, 7, 8.. అక్టోబరులో 18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31.. నవంబరులో 1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29.. డిసెంబరులో 3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు, రిసార్టులు, ఫామ్ హౌస్‌లకు అప్పుడే డిమాండ్ మొదలైంది. తమ తాహతను బట్టి వీటిని పెళ్లివారు బుక్ చేసుకుంటున్నారు. ఇక, హైదరాబాద్‌లోని కొంపల్లి, షాద్‌నగర్, శంషాబాద్, చేవెళ్ల, కీసర, ఘట్‌కేసర్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఫామ్ హౌస్‌లు, రిసార్టులు వివాహ వేడుకలకు పెద్ద సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. అంతేకాదు, పెళ్లికి వచ్చే అతిథులకు వడ్డించే విందు నుంచి రిటర్న్ గిఫ్ట్‌లు వరకూ ఎక్కడా రాజీపడటం లేదని, ఖర్చుకు వెనుకాడటం లేదని కొంపల్లిలోని ఓ ఫామ్ హౌస్ యజమాని వెల్లడించారు. శాకాహార భోజనం ఒక్కో ప్లేటుకు రూ.2,000 ఛార్జ్ చేస్తామని తెలిపారు.
శంషాబాద్ సమీపంలో ఫామ్ హౌస్ ఉన్న లక్ష్మీ సింగ్ అనే ఆయన మాట్లాడుతూ.. నగరంలోని కళ్యాణ మండపాలతో పోలిస్తే తమ రిసార్టులో జరిగే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కుువేనని అన్నారు. సంప్రదాయాలతో పాటు పర్యావరణహితంగా ఇక్కడ పెళ్లిళ్లుకు ఏర్పాట్లు చేస్తుంటామని చెప్పారు. పర్యావరణానికి హానికలిగించని సామాగ్రిని అలంకరణకు వాడుతామని, పిల్లలు తమ సమయాన్ని ఆనందంగా గడపడానికి సంప్రదాయ ఆటలు ఇక్కడ ఉంటాయన్నారు. దేశీ ఆవు పాలు, నెయ్యి వంటివి వంటకాలకు వినియోగిస్తామని వివరించారు.