77 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. ఎర్రకోట నుంచి మంగళవారం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పలు కొత్త పథకాల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతికతను గ్రామీణాభివృద్ధిలో వినియోగించే పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్టు మోదీ తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి 15 వేల మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా గ్రామాల్లోని రెండు కోట్ల మంది అక్కచెల్లెళ్లను లక్షధికారులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.
‘స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ద్వారా డ్రోన్లను నిర్వహిస్తాం... ఇప్పటికే దేశంలోని 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు.. మనం మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్న గ్రామానికి వెళితే బ్యాంకుల్లో దీదీలు, అంగన్‌వాడీలు కనిపిస్తారు.. మందులను పంపిణీ చేసే సోదరిలు కనిపిస్తారు.. గ్రామాల్లో 2 కోట్ల లక్షల మంది ఆడపడుచులను లక్షాధికారులుగా సృష్టించాలన్నది నా కల’ అని మోదీ అన్నారు.
‘డ్రోన్ ఆపరేటింగ్ సహా మరమ్మతులు చేయడంలో మహిళలకు శిక్షణ ఇచ్చే అగ్రి-టెక్‌పై దృష్టి పెట్టాం’ అని తెలిపారు. పురుగు మందులు, నేల, పంట పోషకాల పిచికారీలో డ్రోన్ల వినియోగంపై ఈ ఏప్రిల్‌లో ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీచేసింది. ‘వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం డ్రోన్‌లను అందిస్తుంది. మన వ్యవసాయ పనుల కోసం డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు ప్రారంభిస్తాం’ అని మోదీ చెప్పారు.
దేశ ప్రగతిలో మహిళాభివృద్ధిదే కీలక పాత్రని ప్రధాని ఉద్ఘాటించారు. ‘ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పౌర విమానయాన రంగంలో అత్యధికంగా మహిళా పైలట్లు ఉన్నట్టయితే అది మన దేశమేనని భారత్ గర్వంగా చెప్పగలదు.. చంద్రయాన్ లేదా చంద్రుడిపై ఇతర ప్రయోగాల్లో చాలా మంది మహిళా శాస్త్రవేత్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
మరోవైపు, ‘నారీ సమ్మాన్’ గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రధాని తన విదేశీ పర్యటనల్లో ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ‘ఓ దేశానికి చెందిన ఒక సీనియర్ మంత్రి భారత్‌లో మహిళలు సైన్స్, ఇంజనీరింగ్ చదువుతున్నారా? అని అడిగారు.. నేడు భారత్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ కోర్సులను తీసుకుంటున్నారని మంత్రికి చెప్పారు. మన అమ్మాయిలు అత్యధికంగా ఈ కోర్సులు చదువుతున్నాని తెలిసి ఆయన (మంత్రి) ఆశ్చర్య పోయారు.. మన దేశం ఈ సామర్ధ్యం నేడు కనిపిస్తోంది’ అని మోదీ అన్నారు.