తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుమల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనులో చిక్కింది మగ చిరుతగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, భక్తులకు నడకదారిలో భద్రత కల్పిస్తూనే చిరుతను బంధించే చర్యలు చేపట్టామని వివరించారు. అటవీశాఖ అధికారుల సూచనతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని, కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలను బంధించేలా కార్యచరణ రూపొందిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు.