పర్యావరణానికి, మానవుల ఆరోగ్యానికి హాని జరగకుండా నివారించడానికి సేంద్రియ వ్యవసాయం చక్కటి మార్గమనే ప్రచారం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ప్రపంచ ప్రజలందరికీ సేంద్రియ సాగు పద్ధతుల ద్వారా ఆహారధాన్యాలు పండించి సరఫరా చేయడమే అత్యుత్తమ పరిష్కారమనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిన నేపథ్యంలోనే గాక, సేంద్రియ వ్యవసాయం విస్తరణ, ఇందులో సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కొన్ని వాస్తవాలు కనిపిస్తాయి. జనసంఖ్య 140 కోట్లు దాటిన ఇండియాలో ఇప్పుడిప్పుడే సేంద్రియ సాగు నెమ్మది నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ తరహా సాగు విస్తీర్ణం కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా తిండిగింజలను పండించి కనీసం నాలుగో వంతు భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సమీప భవిష్యత్తులో జరిగే పనికాదని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు సేంద్రియ సాగు అంటే ఏమిటో మొదట తెలుసుకుందాం. కృత్రిమ పురుగుమందులు, రసాయన ఎరువులు వాడకుండా ఆహారధాన్యాలు పండించడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. జన్యుపరమైన మార్పులతో రూపొందించిన మొక్కలను కూడా ఈ సేంద్రియ సాగులో ఉపయోగించరు. ప్రకృతిసిద్ధమైన ఎరువులు, క్రిమిసంహారకాల ద్వారా తిండిగింజలు, ఆహార ధాన్యాలు, కూరగాయల సాగు కొనసాగుతుంది. ఈ పద్ధతి వల్ల నేల నాణ్యత బావుంటుంది. ఇలా రసాయనాల అవశేషాలు ఆహార పదర్ధాల్లోకి రాకుండా నివారించవచ్చు. కాని, సేంద్రియ వ్యవసాయంలో భారీ దిగుబడులు ఇంకా సాధ్యం కావడం లేదు. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో సేంద్రియ వ్యవసాయం వాటా చాలా తక్కువ. ప్రజలందరికీ సేంద్రియ ఆహారం అందించడం ఇప్పట్లో సాధ్యం కాదని, ఈ తరహా సాగు పరిమిత పరిణామంలోనే సాగుతుందని, ఇది ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.