కృష్ణా జిల్లా పెనమలూరు ఆర్సీఎం చర్చి ప్రాంతానికి చెందిన అలోకం పవన్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంకకు చెందిన ఈలి నాగేశ్వరరావు వీఆర్ సిద్ధార్థ బీఈడీ కళాశాలలో 2019లో బీఈడీ చేశారు. అక్కడ వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇక్కడ చదువుతూనే కృష్ణలంకలోని సత్యంగారి హోటల్ వద్ద ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. పవన్‌కు అమ్మాయి లక్షణాలు ఉండడంతో నాగేశ్వరరావు అతనిపై మనసుపడ్డాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో వెజినో ప్లాస్టీ సర్జరీ ద్వారా పవన్ అమ్మాయిగా మారాడు. పేరును భ్రమరాంబగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి పవన్, నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో నాగేశ్వరరావు... భ్రమరాంబను పెళ్లి చేసుకోడానికి తిరస్కరించాడు. దీనిపై ఆమె ఈనెల 10న కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్జరీ కోసం రూ.26లక్షలు ఖర్చయిందని, 11సవర్ల బంగారం తాకట్టు పెట్టి లింగమార్పిడి చేయించుకున్నానని ఆ ఫిర్యాదులో పేర్కొంది.