సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతి తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణారావు మృతికి ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘‘నిఖార్సైన జర్నలిస్టుగా, పక్షపాతం చూపని రాజకీయ విశ్లేషకునిగా కృష్ణారావు ఎంతో పేరు పొందారు. ఆయనతో నా ఆత్మీయ అనుబంధం సుదీర్ఘమైంది. కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు’’ అని పేర్కొన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ విశ్లేషకుడిగా ప్రాచుర్యం పొందిన సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతి చెందడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం రంగానికి చేస్తున్న కృషి ఆయన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. కృష్ణారావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.