నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దుర్మార్గ పాలన సాగిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ మండిపడ్డారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు విశాఖపట్నం, కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో ‘రాష్ట్రాన్ని రక్షించండి-దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో చేపట్టిన బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అమర్‌జిత్ కౌర్ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూడడం హేయమైన చర్య అన్నారు.