ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనాలు ఉన్నవారికి .... ఇకపై క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 06:24 PM

ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్సీ ( వెహికల్ రిజిస్ట్రేషన్ల సర్టిఫికెట్), డ్రైవింగ్ లైసెన్స్‌లను స్మార్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డుల్ని క్యూఆర్ కోడ్‌తో ఉండేలా ప్లాన్ చేసింది. 2024 అక్టోబర్ నుంచి రవాణాశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్న అన్ని కార్డుల్ని జారీ చేయనున్నారు. ఈ కార్డుల్ని కూడా స్మార్ట్ కార్డులుగా జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ 8వేల నుంచి 10 వేల వరకు ఆర్సీలు,డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు అవసరం. ఈ కార్డుల్ని తయారు చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పంపించేందుకు రవాణాశాఖ ఛార్జీలను వసూలు చేస్తోంది. ఒక్కో కార్డుకు మొత్తం రూ.235 వసూలు చేస్తున్నారు.. ఇందులో కార్డుకు రూ.200, పోస్టల్ ఛార్జీలు రూ.35.


గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ కార్డుల్ని జారీ చేసినా.. మధ్య, మధ్యలో కాంట్రాక్టర్ ఆపేశారు.. కార్డులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2023లో పూర్తిగా స్మార్ట్ కార్డుల్ని నిలిపివేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డుల్ని జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 2024 అక్టోబర్ 1 నుంచి ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి ఈ స్మార్ట్ కార్డుల్ని జారీ చేయనుంది. ఈ మేరకు అవసరమైన ఫీజును వసూలు చేస్తున్నారు. అయితే కొద్దిరోజులు ఈ స్మార్ట్ కార్డుల్ని చిప్‌లతో ఇవ్వాలా.. చిప్ లేకుండా ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్ కూడా నడిచింది. అయితే చిప్ లేకుండా కార్డుల్ని ఇవ్వాలని నిర్ణయించారు. చిప్ ఉండే కార్డులతో పోలిస్తే ఈ క్యూఆర్ కోడ్‌తో ఉండే కార్డులకు తక్కువ ఖర్చు అవుతుంది. కేవలం రూ.72 మాత్రమే ఖర్చవుతుంది (పోస్టల్ ఫీజులతో కలిపి).. అందుకే క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులకే మొగ్గుచూపారు.


ఈ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డుల్ని ప్రింట్ చేసి పోస్టులో పంపించే బాధ్యతను క్రాంట్రాక్టర్‌కే అప్పగించాలని నిర్ణయించారు. త్వరలోనే టెండర్లు కూడా పిలిచే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ సంస్థ 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి నెలాఖరు వరకు మొత్తం 27 లక్షల కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. 2023 ఆగస్టు నుంచి 2024 సెప్టెంబర్ వరకు 23 లక్షల కార్డులు జారీ చేయలేదు. అయితే వీరిలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు కడితే.. వారికి మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. మొత్తం మీద వాహనదారులకు రిలీఫ్ ఇస్తూ.. ఏపీ ప్రభుత్వం ఆర్సీలతో పాటుగా డ్రైవింగ్ లైసెన్సుల్ని కూడా క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులుగా జారీ చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa