శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వింత ఘటన చోటుచేసుకుంది. తన భర్త, మరో వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్నారంటూ ఓ భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇద్దరూ కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారంటూ తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనను కాపాడాలంటూ ధర్మవరం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం.. ఆమె భర్త ఓ ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నారు. అదే ఆఫీసులో పనిచేసే మరో వ్యక్తితో అతనికి అనైతిక సంబంధం కొనసాగుతోంది. ఓ రోజు ఇద్దరూ పడక గదిలో సన్నిహితంగా ఉండటాన్ని ఆమె గుర్తించింది. దీంతో అప్పటి నుంచి ఈ సంగతి బయటకు చెప్తే చంపేస్తామని ఇద్దరూ బెదిరిస్తున్నారని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. వారిద్దరి నుంచి తనను కాపాడాలని పోలీసులను కోరింది.
అయితే బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. వీరిద్దరికీ నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కొన్ని నెలలకు భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బు, బంగారం తీసుకురావాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. కూతురి కాపురం కోసం ఆమె తల్లిదండ్రులు తాహతుకు మించి అల్లుడికి సమర్పించుకున్నారు. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవటంతో బాధితురాలు పుట్టింటిలోనే ఉండిపోయింది. అప్పటి నుంచి భర్త, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి తనను, తన తండ్రిని బెదిరిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా ఫాలో చేస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులను రక్షణ కల్పించాలని కోరారు.
బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. దీని వెనుక నిజానిజాలు తేల్చే పనిలో ఉన్నారు. బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా, లేక కట్నం కోసం వేధిస్తున్నాడని.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అయితే ఈ వ్యవహారం మాత్రం స్థానికంగా సంచలనం రేపుతోంది. సాధారణంగా తన భర్తకు, మరో మహిళతోనో, అమ్మాయితోనో సంబంధం ఉందని.. రోడ్డెక్కడం, పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అంతా వింతగా ఉందని ఈ విషయం తెలిసిన పలువురు చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa