అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ప్రతీకార సుంకాల విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసింది. టారీఫ్‌లను విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక విధానానికి కేంద్రబిందువుగా, ప్రధాన విదేశాంగ విధాన సాధనంగా సుంకాలను వాడుకోవదాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అధ్యక్షుడి నిర్ణయం వినియోగదారులు, వ్యాపారాలకు ఖర్చుల భారం పెంచిందని వ్యాఖ్యానించింది. ట్రంప్ వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన మొదటి తీర్పు ఇదే. గతేడాది ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్.. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించి.. వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. శత్రువులు, మిత్రులు అనే తేడా లేకుండా సుంకాలను కనీసం 10 శాతంగా నిర్ణయించాయి. ధర్మాసనంలో మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్ సుంకాలను వ్యతిరేకించగా.. ముగ్గురు మాత్రమే సమర్ధించారు.
ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాశారు. ఆయనతో పాటు ముగ్గురు లిబరల్ న్యాయమూర్తులు, సంప్రదాయవాదులైన నీల్ గోర్సుచ్,అమీ కోనీ బారెట్ కూడా ట్రంప్ సుంకాలను వ్యతిరేకించారు. ‘‘ఏకపక్షంగా సుంకాలను విధించే అసాధారణ అధికారాన్ని అధ్యక్షుడు నొక్కి చెబుతున్నారు’ అని జస్టిస్ రాబర్ట్స్ పేర్కొన్నారు. ట్రంప్ యంత్రాంగం "ఏ చట్టాన్ని సూచించలేదని, కాంగ్రెస్ గతంలో IEEPA చట్టం సుంకాలకు వర్తింపజేయవచ్చని చెప్పిందని ఆయన అన్నారు. ఇంత వరకూ వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని తేల్చిచెప్పింది. భారత్‌పై కూడా ట్రంప్ 18 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ప్రధాన విధానపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతించిందని సుప్రీంకోర్టు తీర్పు స్ఫష్టం చేసింది. రాబోయే దశాబ్దంలో ఫెడరల్ బడ్జెట్‌ను రెండు ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు, తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకే సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. సుంకాల పెంపు ఉత్తర్వులను రద్దుచేస్తే జాతీయ భద్రత, విదేశాంగ విధానం.. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని కోర్టును ట్రంప్ హెచ్చరించారు.
కానీ దిగుమతి సుంకాలను విధించడానికి తమకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ట్రంప్ యంత్రాంగం అంటోంది. దీని ద్వారా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. .ఇదిలా ఉండగా, పరస్పర సుంకాల విధింపునకు 1977 అత్యవసర అధికారాల చట్టాన్ని ఉపయోగించలేరనే కోర్టు తీర్పు స్పష్టం చేసినా.. రిటైలర్లు, ఇతర వ్యాపారాలలో నిర్వహణ ఖర్చుల గురించి అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.
న్యాయమూర్తులు క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాగ్, శామ్యూల్ అలిటో మాత్రం మిగతా ఆరుగురితో విభేదించారు. అయితే, ఈ తీర్పు ట్రంప్ విధించిన అన్ని సుంకాలను ప్రభావితం చేయదు. ఉదాహరణకు, వేర్వేరు చట్టాలను ఉపయోగించి ఉక్కు, అల్యూమినియంపై ఆయన విధించిన టారిఫ్‌లు అమలులో ఉంటాయి. ట్రంప్ రెండు విధాలుగా సుంకాలను విధించారు. దేశం వారీగా లేదా పరస్పర సుంకాలు ఇవి చైనాకు 34%, మిగిలిన దేశాలకు కనీసం 10%గా ఉంది. మరొకటి ఫెంటానిల్ ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు కెనడా, చైనా, మెక్సికో వస్తువులపై ట్రంప్ విధించిన 25% సుంకాలు. ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు కంపెనీలు సుంకాలను చెల్లించాయి. ఈ తీర్పుతో వేలాది కంపెనీలు వాటిని తిరిగి పొందడానికి వ్యాజ్యాలు దాఖలు చేయనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa