ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ సముద్ర జలాల్లో ఆ నాలుగు రోజులు ,,,,,భారత్ సీజ్ చేసిన ఇరాన్ నౌక

national |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:22 PM

భారత సముద్ర జలాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న మూడు భారీ చమురు ట్యాంకర్లను భారత తీర రక్షక దళం చాకచక్యంగా పట్టుకుంది. ఈక్రమంలోనే ఇరాన్ చమురు వ్యాపారంపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ.. తప్పుడు పత్రాలతో సరుకు రవాణా చేస్తున్న ఈ నౌకల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ నౌకలు పట్టుబడడానికి ముందు పాకిస్థాన్ సముద్ర జలాల్లో నాలుగు రోజులు గడిపినట్లు అధికారులు తెలుసుకున్నారు. అలాగే అక్కడ సిగ్నల్స్ నిలిపివేసిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.


ఏమిటీ 'డార్క్' ఆపరేషన్?


ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా 'ఎంటీ ఆస్ఫాల్ట్ స్టార్' అనే మాలీ దేశ పతాకంతో ఉన్న నౌకను ముంబై తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఫిబ్రవరి 5 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఈ నౌక జనవరి 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పాకిస్థాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఎనిమిది రోజుల పాటు ఉండిపోయింది. అయితే జనవరి 28న ఈ నౌక తన 'ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్', రేడియో సెన్సార్లను ఏకంగా 11 గంటల పాటు నిలిపివేసింది. సముద్ర రంగంలో ఇలా సిగ్నల్స్ ఆఫ్ చేయడాన్ని 'గోయింగ్ డార్క్' అంటారు. సాధారణంగా స్మగ్లింగ్ లేదా గూఢచర్యానికి పాల్పడే నౌకలు తమ ఉనికిని దాచడానికి ఇలా చేస్తాయి.


అయితే కోస్ట్ గార్డ్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నౌకకు ఇన్సూరెన్స్ లేకపోవడమే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను వాడుతున్నట్లు తేలింది. భారత జలాల్లోనే ఈ నౌక తన సోదర నౌకలైన ఎంటీ అల్ జాఫ్జియా, ఎంటీ స్టెల్లార్ రూబీలకు నిబంధనలకు విరుద్ధంగా చమురును బదిలీ చేసింది. అలాగే స్టెల్లార్ రూబీ నౌక కర్ణాటకలోని కార్వార్ పోర్టులోకి ప్రవేశించేందుకు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను వాడగా.. అల్ జాఫ్జియా నౌక గుజరాత్‌లోని అలంగ్ షిప్ బ్రేకింగ్ యార్డులోకి వెళ్లేందుకు ఫోర్జరీ పత్రాలను సమర్పించింది.


వాట్సాప్ చాట్స్‌తో దొరికిపోయిన వైనం


నౌక మాస్టర్ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా.. విదేశీ హ్యాండ్లర్లు, కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన వాట్సాప్ సంభాషణలు దొరికాయి. పక్కా ప్లాన్ ప్రకారమే వీరు సిగ్నల్స్ ఆఫ్ చేసి సరుకును అక్రమంగా తరలిస్తున్నట్లు నిరూపితమైంది. ముంబైలోని ఎల్లోగేట్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదు అయింది. శ్యామ్ బహదూర్ చౌహాన్ సహా తొమ్మిది మంది సిబ్బందిపై కుట్ర, స్మగ్లింగ్, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ మూడు నౌకలు కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో ముంబై తీరంలోనే ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ నౌకలతో తమకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ.. పాక్ జలాల్లో ఇవి జరిపిన 'రహస్య ప్రయాణం' వెనుక ఉన్న దేశ భద్రతా కోణాన్ని భారత నిఘా సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa