ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రకోట లక్ష్యంగా లష్కరే తొయిబా దాడులు.. నిఘా వర్గాల 'హై అలర్ట్'

national |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:19 PM

 దేశ రాజధాని ఢిల్లీని మరోసారి నెత్తుటి మడుగులో ముంచేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తొయిబా' భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది. చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు చాందినీ చౌక్‌లోని ప్రసిద్ధ దేవాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్న కీలక మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సమాచారంతో కేంద్ర భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసులు అత్యంత అప్రమత్తం అయ్యారు.


ప్రతీకార వాంఛతో ఉగ్ర ప్లాన్..


ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం.. ఈ నెల 6వ తేదీన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మహుతి దాడికి ప్రతీకారంగా లష్కరే తొయిబా ఈ దాడులకు సిద్ధం అవుతోంది. ఆ మసీదు పేలుడులో 31 మంది మరణించగా.. 160 మందికి పైగా గాయపడ్డారు. దీనికి బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే భారత్‌లోని రద్దీ ప్రాంతాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రవాద హ్యాండ్లర్లు తమ స్లీపర్ సెల్స్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


 సరిగ్గా మూడు నెలల క్రితం అంటే 2025 నవంబర్ 10వ తేదీన ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో 12 మంది మరణించగా, రెండు డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు జరిగిన పరిణామాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో డాక్టర్‌గా పని చేస్తున్న ఉమర్ మొహమ్మద్ ఆ కారును నడుపుతూ పేలుడుకు కారణం అయ్యాడు. అదే రోజు హర్యానాలో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలోని కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్ పట్టుబడటంతో.. తాను కూడా దొరికిపోతాననే భయంతో ఉమర్ మొహమ్మద్ ముందస్తుగానే ఎర్రకోట వద్ద కారును పేల్చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.


తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని చాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులపై నిఘా పెట్టడమే కాకుండా పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఐఈడీ ముప్పు ఉన్నందున డాగ్ స్క్వాడ్స్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa