మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నింపిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటన ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ప్రమాదం వెనుక లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రామ్మోహన్ నాయుడు టార్గెట్‌గా ఆరోపణలు
జనవరి 28వ తేదీన పుణె జిల్లా బారామతి సమీపంలో జరిగిన లీర్జెట్ 45ఎక్స్ఆర్ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విమానాన్ని ఆపరేట్ చేసిన 'వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థపై రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. "ఈ విమానయాన సంస్థకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పార్టీకి మధ్య ఉన్న సంబంధాలపై మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలి" అని రోహిత్ పవార్ లేఖలో పేర్కొన్నారు.
కుట్ర కోణంపై తీవ్ర అనుమానాలు..
ఈ ప్రమాదం వెనుక రెండు రకాల కుట్రలు ఉండే అవకాశం ఉందని రోహిత్ పవార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. అజిత్ పవార్‌ను పక్కకు తప్పించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం కావొచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే వీఎస్ఆర్ సంస్థ ప్రయోజనాల కోసం లేదా భద్రతా లోపాలను కప్పిపుచ్చేందుకు జరిగిన కుట్ర కావొచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ రోజు విమానాన్ని నడిపిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డును కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో మద్యం సేవించినందుకు మూడు ఏళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన పైలట్‌కు విమానాన్ని ఎలా అప్పగించారని ఆయన నిలదీశారు.
న్యాయం కోసం ప్రధానికే విన్నపం
"దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నందున.. సాధారణ విచారణతో న్యాయం జరుగుతుందని మేము భావించడం లేదు. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షా గారే స్వయంగా స్పందించి అజిత్ దాదాకు న్యాయం చేయాలి" అని రోహిత్ పవార్ తన లేఖలో విన్నవించారు. ఈ కేసులో ప్రభావితం చేసే శక్తులు ఎక్కువగా ఉన్నందున, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో పారదర్శకమైన విచారణే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ మహారాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం లేదా విమానయాన శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa