ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్ల కిందటి వాటికి..త్వరలోనే హక్కులు,,,ఇళ్ల స్థలాల హక్కులపై ఏపీ మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 06:13 PM

అసైన్డ్ ఇళ్ల స్థలాల హక్కులపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ల కిందట ఇచ్చిన అసైన్డ్ ఇళ్ల స్థలాలపై త్వరలోనే హక్కులు కల్పించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రోజున మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఈ వివరాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందన్న మంత్రి.. ప్రస్తుత ప్రభుత్వం దానిని సరిచేస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పదేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ఇళ్ల స్థలాలపైనా లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తామని ప్రకటించారు.


రాష్ట్రంలో ఇనాం భూముల సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తోందన్నారు. అలాగే 22ఏ జాబితాలోని భూముల అంశాన్ని కూడా పరిష్కరిస్తామన్నారు. వైసీపీ పాలనలో లక్షా 70 వేల ఎకరాల భూమిని తమ వారికి కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని మంత్రి ఆరోపించారు. అలాగే తమకు నచ్చని వ్యక్తుల భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3.32 కోట్ల ఎకరాల భూమి ఉంటే.. 22ఏ జాబితాలో ఏకంగా1.80 కోట్ల ఎకరాల భూమి ఉందని వెల్లడించారు. 22ఏ జాబితా అంశాన్ని పరిష్కరించేలా అధికారాలు బదలాయించామని మంత్రి వివరించారు.


22ఏ జాబితాలో భూమిని చేర్చాలంటే తప్పనిసరిగా ఆ భూమికి సంబంధించిన పట్టాదారుడికి ఈకేవైసీ ద్వారా నోటీసులు ఇవ్వాలనే నిబంధన తెచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తయిన చోట్ల కొత్త పాసుపుస్తకాలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకూ 22 లక్షల 30 వేల పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధమయ్యాయని.. తప్పులు దొర్లిన వాటిని సరిదిద్దామని వెల్లడించారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించే ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.


ఏపీ కోసం కొత్త చట్టం..


మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో కొత్త ప్రతిపాదన చేశారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే ఏపీకి కూడా ప్రత్యేకంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం తేవాలని సూచించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని సవరిస్తేనే రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి చేకూరుతుందని.. ఆదాయం ఎక్కువ వస్తుందని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa