ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమర్శలకు చెక్ పెట్టేలా,,,,,హిందూపురంలో సొంతింటి నిర్మాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 06:09 PM

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంతింటి నిర్మాణం కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన బాలకృష్ణ.. ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమేనని ప్రకటించారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను హిందూపురం నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. మూడుసార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా రాష్ట్రానికి సీఎంను చేశారని అన్నారు.


ఆయన వారసుడిగా తనను కూడా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిపించారన్న బాలకృష్ణ.. అందుకే హిందూపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఇక్కడే సొంతిల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. హిందూపురంలో సొంతిల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానని.. ఇన్ని రోజులకు తన కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందూపురం నియోజకవర్గా్న్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.


అయితే హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ బాలయ్య.. ఎన్నిసార్లు ప్రజలకు కనిపించారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఆ మధ్య విమర్శలు చేశారు. మీటింగ్ ఉంటే వచ్చి ముఖం చూపించి పోతారని.. ఇక్కడి సమస్యలు ఆయనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి ఏం బాధ్యత తీసుకుంటారంటూ గతంలో విమర్శలు చేశారు.


మరో అడుగు ముందుకేసిన వైసీపీ ఇంఛార్జి భర్త..


యాంకర్ శ్యామల విమర్శలు ఇలా ఉంటే.. వైసీపీ హిందూపురం నియోజకవర్గం ఇంఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి గతేడాది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో అడుగు ముందుకేసిన వేణు రెడ్డి.. బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ప్రజలు 40 సంవత్సరాల నుంచి బానిస బతుకులు బతుకుతున్నారని.. ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చున్నోడి కాళ్ల కింద బానిసలుగా మారారంటూ వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. మనం వారికి ఓట్లేస్తే.. వారు మాత్రం హైదరాబాద్‌లో ఉంటారంటూ వేణు రెడ్డి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa