విశాఖ జిల్లా భీమిలిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భీమిలి బీచ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జిలో శుక్రవారం రోజున శ్యామ్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి సిబ్బంది సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన వ్యక్తిది విశాఖలోని కోటవీధి అని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు కుటుంబసభ్యులు, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల శ్యామ్ కుమార్ హైదరాబాద్‌లో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఈ క్రమంలోనే ఓ యువతితో శ్యామ్ కుమార్‌కు పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హైదరాబాద్‌లో ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే తనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో శ్యామ్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో భయపడిపోయిన శ్యామ్ కుమార్.. రెండు రోజుల కిందట హైదరాబాద్ నుంచి భీమిలికి వచ్చేశాడు. అక్కడే లాడ్జిలో గది తీసుకుని ఉంటున్నాడు.
అయితే ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి చనిపోయినట్లు స్నేహితుల ద్వారా శ్యామ్‌కుమార్‌కు తెలిసింది. దీంతో శుక్రవారం రోజున శ్యామ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గదిలోకి వెళ్లిన శ్యామ్ కుమార్, ఎంతకూ బయటకు రాకపోవటంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అదనపు తాళంతో గది తెరిచి చూసేసరికి శ్యామ్ కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. శ్యామ్ కుమార్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
శ్యామ్ కుమార్ సోదరుడు ఇచ్చి్న ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు లాడ్జి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఎలుకల మందు ప్యాకెట్లు,మద్యం సీసాను గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మద్యంలో ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa