రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని టీడీపీ మంత్రాలయం నియోజ కవర్గ ఇన్చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా, కౌతాళం మండలంలోని ఎరిగేరి నుంచి ఉరుకుంద గ్రామం వరకు దెబ్బతిన్న రోడ్డు దుస్థితిపై సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాసపు ఉత్సవాలకు లక్షల్లో భక్తులు వచ్చి స్వామి వారి దర్శించుకుంటారని ,అయితే ఎరిగేరి నుంచి ఉరకుంద వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితిపై చర్చకు సిద్ధమా? అని వైసీపీకి చాలెంజ్ విసిరారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి మండలంలో దెబ్బతిన్న రోడ్లు కనిపించవా? అని ప్రశ్నించారు.