ఆస్పత్రిలో రోగులను కాపాడాల్సిన ఓ నర్సు.. సీరియల్ కిల్లర్‌గా మారింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా అప్పుడే పుట్టిన ఏడుగురు శిశువులను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అయితే ఆ ఆస్పత్రిలో వరుసగా అప్పుడే పుట్టిన పసికందులు ప్రాణాలు కోల్పోవడంతో అనుమానం వచ్చి విచారణ జరపగా.. అందులో పనిచేసే 33 ఏళ్ల ఓ నర్స్ ఈ దారుణాలకు తెగబడినట్లు గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి.. ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. శిశువులను చంపడానికి ఆమె చెప్పిన కారణాలు విని వారు ఆశ్చర్యపోయారు. అదే ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌పై ప్రేమ, తనకు పిల్లలు పుట్టరనే నిరాశ, చిన్న పిల్లలను హింసించడంలో ఉన్న ఆనందం.. ఇలా రకరకాల కారణాలతో ఈ హత్యలు చేసినట్లు తేలింది.
ఇంగ్లాండ్‌లోని ఆసుపత్రిలో అప్పుడే పుట్టి లోకం చూడని శిశువులను వరుసగా హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ అమానవీయ ఘటనలో 33 ఏళ్ల నర్స్ లూసీ లెట్బీని కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా.. చిన్నారులను చంపడానికి లూసీ లెట్బీ చెప్పిన కారణాలు ప్రతీ ఒక్కరినీ ఆగ్రహానికి గురిచేశాయి. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేసే ఓ డాక్టర్.. లూసీతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడే పుట్టిన శిశువుల వార్డులో పిల్లలకు ఏదైనా అస్వస్థత గురైనపుడు చికిత్స అందించే డాక్టర్లలో ఉన్న ఓ డాక్టర్‌తో లూసీకి ఏర్పాడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మొదట్లో ఆ డాక్టర్ దృష్టిలో పడేందుకే ఆమె పిల్లలకు హాని కలిగించిందని గుర్తించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాటింగ్ జరిగినట్లు తేల్చారు. 2016 జులైలో లూసీని నర్స్ జాబ్ నుంచి తీసేసిన తర్వాత వారిద్దరూ కలిసి లండన్‌కు ట్రిప్ వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో లూసీని అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమె ఇంట్లో కొన్ని పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను మంచిదాన్ని కాదని.. తానే ఇలా చేశానని రాసుకుంది. చిన్నపిల్లలను కావాలనే చంపానని.. వారిని మంచిగా చూసుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొంది. తనకు ఎప్పటికీ పెళ్లి కాదని.. పిల్లలు కూడా పుట్టరని.. అందరు ఉంటే వచ్చే కుటుంబ బంధుత్వాలు తనకు తెలియదని మరో పేపర్‌లో రాసి ఉంది. అవన్నీ పరిశీలించిన పోలీసులు.. నిరాశ, మానసిక వేదనతోనే లూసీ ఇంతటి దారుణాలకు పాల్పడిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక విచారణ సందర్భంగా తనకు చిన్నపిల్లల వార్డులో ఉన్నపుడు చాలా బోర్‌గా ఫీలయ్యేదాన్నని అంగీకరించింది. ఈ కేసు మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో 10 నెలలు విచారణ జరిగింది. పిల్లల్ని చంపడంలో వచ్చే థ్రిల్, డాక్టర్‌పై ప్రేమ, పిల్లలు పుట్టరనే నిరాశ, మానసికంగా వేదనకు గురికావడం వంటి కారణాలతోనే లూసీ ఈ ఘటనలకు పాల్పడినంట్లు అనుమానించారు.
చిన్నపిల్లల వార్డులో శిశువులకు గాలితో నిండిన ఇంజెక్షన్లు చేయడం, ఎక్కువ పాలు తాగించడం, ఇన్సులిన్‌తో విషపూరితం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పిల్లలకు హాని చేసి ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని డాక్టర్లకు చెప్పేదని.. ఆ తర్వాత వారు వచ్చి పిల్లలకు చికిత్స అందించేవారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో డాక్టర్లు, పిల్లల తల్లిదండ్రులు పడే టెన్షన్, భయాన్ని చూసి లూసీ ఎంజాయ్ చేసేదని కోర్టుకు వివరించారు. 2016 జూన్‌లో ఓ చిన్నారిని ఉద్దేశిస్తూ ఆ శిశువు ప్రాణాలతో బయటికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా అని డాక్టర్లతో చెప్పిందట. అయితే అది జరిగిన కొన్ని నిమిషాలకే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే లూసీ చేసిన చిన్న పిల్లల హత్యల వెనుక బలమైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ.. ఆమనే వారిని హత్య చేసిందని కోర్టు గుర్తించింది. దీంతో ఈ వరుస హత్యల కేసులో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో వచ్చే సోమవారం లూసీకి శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.