ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పింది నిజమే.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 07:11 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ చెప్పింది నిజమే అంటున్నారు మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపీణీలో అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం లో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో తాను ఒకడిని అన్నారు. తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఓవైపు మాత్రమేనని.. రెండో వైపు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు.


భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు. పదవులు ఇచ్చేదాకా నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా! అంటూ వ్యాఖ్యలు చేశారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.


అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తానని.. లేకపోతే తాను నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో వ్యాపారాలు చేసుకుంటానన్నారు. గతంలోనే అధిష్టానానికి అన్నీ చెప్పానని.. ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన లేదన్నారు. తానేంటో వాళ్లకు తెలుసు, కుతంత్రాలు చేసే వాళ్ళకు తెలుసు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అన్నారు. తాను పక్కకు పోతే కుర్చీ లాక్కుందామని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెండు సీట్లకు మాత్రమే పోటీ ఉండదు, ఒకటి జగన్మోహన్‌రెడ్డి పులివెందుల, రెండు చంద్రబాబు కుప్పం అన్నారు. వాళ్లిద్దరికి ఎవరు పోటీ రారు, సీటు అడగలేరన్నారు.


రాజకీయాల్లో పక్కోడి కుర్చీ లాక్కోవాలనే ధోరణితో పాటు రాజకీయ ఒత్తిడి ఇటీవల కాలంలో పెరిగిపోయింది అన్నారు వసంత. ఇవేమైనా జమిందారీ పదవుల్లాగా, తరతరాలుగా మనమే కూర్చొవాలన్నట్టుగా కొందరు వ్యవహారం ఉందన్నారు. తనకు లేని ఉద్దేశాలను స్వపక్షంలోనూ, ప్రతిపక్షంలోని వారూ ఆపాదించాలని చూస్తున్నారే తప్ప మరొకటి కాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పని చేస్తున్నానన్నారు. కులం, ప్రాంతం, వర్గాలు ఏదైనా తన ఇంటి గేటు వరకేనన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చినా తనను ఆదరించి గెలిపించిన నాయకుల్ని ప్రజల్ని ఈ నాలుగేళ్లలో ఒక్కమాట కూడా అనలేదన్నారు.


వెన్నుపోటులు పొడిచి వాళ్లు అనుకున్నది సాధించుకోవడం.. అలాగే పదవులు ఇప్పించుకోవడం జరగవన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల నాటికి జగన్‌ మాటే శిరోధార్యమని.. నియోజకవర్గ అభివృద్ధిని శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొనే తాను ఈ వ్యాఖ్యలు చేసినే తప్ప తన వారసత్వాన్ని కొనసాగించుకోవాలనో, ఒక వర్గాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలను పట్టించుకునే సమయం లేదని.. మరో వారం రోజుల్లో నియోజకవర్గం వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తాను అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa