తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. భక్తులకు సులభతరంగా ఉండేందుకు నడకదారి భక్తుల లగేజీని టీటీడీ ఉచితంగా తరలిస్తోంది. గతంలో లగేజీ తరలింపు.. తిరిగి అప్పగించడం మాన్యువల్ పద్దతిలో నిర్వహించామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అధునాతనమైన పద్దతిలో లగేజిని భక్తులుకు అప్పగించే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు.. దాతల సహకారంతో ఈ పద్దతిని అమలు చేస్తున్నామన్నారు.
నడక మార్గంలో భక్తుల లగేజ్ భద్రపరిచే ప్రాంతాల్లో టోకెన్ ఇచ్చే విధానానికి టీటీడీ స్వస్తి పలికింది. అదే స్థానంలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా వీలైనంత త్వరగా భక్తుల లగేజ్ బ్యాగులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి భక్తులుకు సులభతరంగా ఉండేందుకు నడకదారి భక్తుల లగేజీని తరలిస్తుంది. మొత్తం 16 ప్రాంతాల్లో 44 కౌంటర్లలో.. 300 మంది సిబ్బందితో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామంటోంది టీటీడీ.
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 21న సాయంత్రం 5 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 22వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
ఆగస్టు 23న ఉదయం యాగశాల పూజ, ఉదయం 7.30 గంటలకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్నశ్రీ ఆమ్నాయాక్షి(అవనాక్షి) అమ్మవారి ఆలయంలో ఆగస్టు 22వ తేదీ నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 22వ తేదీ మంగళవారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు కంకణ ధారణ నిర్వహించనున్నారు. ఆగష్టు 29వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అభిషేకం, సెప్టెంబరు 5వ తేదీన ఉదయం 7 నుండి 9 గంటల వరకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, సెప్టెంబరు 7వ తేదీ సాయత్రం 6 గంటల వరకు కీలాగారం గ్రామంలో శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారు ఊరేగి గ్రామస్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సెప్టెంబరు 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి నారాయణవనం సముదాయం, కీలాగారం గ్రామాలలో అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa