కొంతమంది అరాచక శక్తుల వల్ల కృష్ణాజిల్లా ప్రతిష్ఠ మసకబారిందని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణాజిల్లా ఉన్నతమైన, నిస్వార్ధమైన నాయకులకు పెట్టింది పేరు అని వెల్లడించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తెలుగుజాతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేశారని కీర్తించారు. కానీ నేడు కొంతమంది అరాచక శక్తుల వల్ల కృష్ణాజిల్లా ప్రతిష్ఠ మసకబారిందని మండలి బుద్ధప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీని అపవిత్రం చేసిన ఎమ్మెల్యేలు కృష్ణాజిల్లాకు చెందిన వారై ఉండడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నిస్వార్ధ నాయకుడు గన్నవరం నుంచి అసెంబ్లీకి వెళ్లారని, అలాంటి గన్నవరం నియోజకవర్గంలో నేడు ఉన్న ఎమ్మెల్యే జిల్లా పరువు తీస్తున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుండి ఉత్తమ నాయకులను ఎన్నుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను అని మండలి పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును బాగుచేయగలిగే వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని ఆయన ఉద్ఘాటించారు. రైతుల భవిష్యత్తును ముందే ఊహించి పట్టిసీమను తెచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సక్రమమైన నాయకుడు రావాలి... జగన్ వంటి వక్రబుద్ధి కలిగిన నాయకులు రాకూడదని స్పష్టం చేశారు.