తాగునీటి సౌకర్యం కల్పించాలని రోడ్డుపై మహిళలు ధర్నా నిర్వహించిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. మడకశిర మండలం చౌటుపల్లి గ్రామ ప్రజలు చాలాకాలం నుంచి తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.