టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఎస్సీ (SC)లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేసిందన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారని, గురుకుల పాఠశాలలో వసతులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.