ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ ఎం ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆశ్రయించింది. గనుల కేటాయింపులుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అయాచిత లబ్ది కలిగించారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్నా సిమెంట్స్‌కు అక్రమంగా లబ్ది చేకూర్చిన కేసులో జగన్‌తో పాటు శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. పెన్నా సిమెంట్స్ కేసులో జగన్, ధర్మాన ప్రసాదరావు , పెన్నా ప్రతాప్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అనంతపురంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు జరిపింది.