కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించడానికి ఓ భక్తుడు ముందుకొచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడు తాపడం చేయించడానికి ఓకే చెప్పినట్లు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. ధ్వజస్తంభం 60 అడుగుల ఎత్తులో ఉండగా దీన్ని టేకుతో కొత్తగా తయారు చేయించనుండగా.. రాగి రేకు అమర్చి దానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించారు. దీని కోసం 2 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.. మొత్తం రూ. 2 కోట్లతో తీర్చిదిద్దడానికి భక్తుడు ఈవోతో చర్చించారు. త్వరలో దీనిపై అంచనాలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
అలాగే అన్నవరంలో ప్రారంభించనున్న ముత్యాల కవచ అలంకరణ సేవ (ముత్తంగి సేవ)కు ముత్యాల కవచాలను రూ.7 లక్షలతో తయారు చేయించేందుకు ఆలయ పురోహిత సంఘం ముందుకొచ్చింది. ఈ మేరకు అంగీకారపత్రాన్ని పురోహిత సంఘం ఈవో ఆజాద్‌కు అందించారు. ఆలయంలో ప్రతి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే పవిత్ర శ్రావణమాసం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు, సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు రత్నగిరిపై నిత్య కల్యాణ మండపంలో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామన్నారు. వీటిలో పాల్గొనే భక్తులు రెండు కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు తెచ్చుకోవాలన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మరోవైపు ఈవో ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నవరం కొండపై ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగుచోట్ల వీటిని ఏర్పాటు చేశారు. కొండపైకి ఎక్కే నాల్గవ మలుపు నుంచి వనదుర్గ ఆలయానికి రోడ్డు ఏర్పాటుచేస్తుండగా ఇది భక్తులతోపాటు ఆలయంలో విధులు నిర్వహించే వారికి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. ఈ రోడ్డు గుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లే ఉద్యగులు 15 నిమిషాల ముందుగా చేరుకుంటారు.
అలాగే సత్యగిరి వై జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 800 కార్లు వరకు పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు తమ కార్లను పాత సీఆర్వో కార్యాలయం పక్కనుంచి దిగువకు ఏర్పాటు చేసిన మార్గం గుండా కొండ దిగువకు ఎటువంటి మలుపులు లేకుండా వెళ్లొచ్చు. ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయడంతో సత్ఫలితాలిచ్చాయి. అలాగే శివసదన్ కాటేజీ నుంచి గిరిప్రదక్షణ రోడ్డుకు చేరేవిధంగా మరో రోడ్డుకు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అయితే ఈ రోడ్డులన్నీ కార్తీకమాసం నాటికి అందుబాటులోకి వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా కొండ దిగువున సైతం సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. వాహనాల తనిఖీ సమయంలో మెయిన్‌రోడ్డుపై వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రత్నగిరి కొండకు చేరే వాహ నాలు సర్వీస్‌రోడ్డు గుండా తనిఖీలు పూర్తిచేసుకుని కొండపైకి వెళతారు.