తిరుమల నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమల నడక మార్గంలో భక్తులకు రక్షణ కల్పించాల్సిన టీటీడీ కర్రలు ఇవ్వడం ఏంటని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వన్య ప్రాణుల కదలికలకు అవసరమైతే అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. భక్తుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
చిరుత దాడిలో మృతిచెందిన ఆరేళ్ల బాలిక లక్షిత కుటుంబానికి ఇప్పటికే రూ.15లక్షల పరిహారం ఇచ్చామని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫు లాయర్ తెలపగా.. మరో రూ.15లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే తిరుమల నడక మార్గంలో వచ్చే భక్తులకు.. అలిపిరి నుంచి తిరుమల వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించారనే అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి.. తిరుమలకు నడక మార్గంలో ఇరువైపుల ఇనుప కంచె ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నడక మార్గంలో వన్యప్రాణుల దాడి నుంచి భక్తులను రక్షించేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. టీటీడీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే.. చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిందని పిల్‌లో ప్రస్తావించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.. కంచె ఏర్పాటు చేసి భక్తులను పులుల బారి నుంచి కాపాడాలని కోరారు. విచారణ చేసిన కోర్టు నోటీసులు జారీ చేసింది.