వైఎస్ షర్మిలా పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై ఏపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ కుటుంబంలోకి వైఎస్ షర్మిళను ఆహ్వానిస్తున్నాం. ఏపీ నుంచి మేము షర్మిలాకు పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం.ఏపీకి ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్ సాక్షిగా నేడు మరోసారి తెరమీదకు రావడం సంతోషం.ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజిత భార్గవ్ అనాలోచిచ ఆలోచన వల్ల కాంగ్రెస్ పార్టీ అపవాదుకు నోచుకుంది. ఏపీలో ఓటర్ల విషయంపై వైసీపీ, టీడీపీ పార్టీలు ఢిల్లీలో ఫిర్యాదులు చూస్తే అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాం. తెలుగుదేశం, వైసీపీ పార్టీలు దొంగ ఓట్లను ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. తక్షణమే హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓట్ల నమోదు ప్రక్రియపై విచారణ జరిపించాలి. రాష్ట్రంలో ప్రకృతి సంపదను, గిరిజన సంపదను దోచుకుని అదానికీ అప్పచెప్పడం చూస్తే బాధాకరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయి.చివరకు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఏపీని నిలిపారు’’ అని మస్తాన్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు.