రాష్ట్రంలో మాజీ సైనికులను ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం రౌతులపాలేనికి చెందిన మాజీ సైనికుడు మోపాడ ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో వ్యవహరించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటే స్థానిక వైసీపీ సర్పంచ్ సంబంధీకులు అతనిపై హత్యాయత్నానికి తెగబడడం దారుణమని పేర్కొన్నారు. పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు కాకుండా, కేవలం సాధారణ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నట్లు తెలుస్తోందన్నారు. సైనికుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసు యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో ఉన్నతాధికారులు చెప్పాలి అని డిమాండ్ చేశారు.