టీటీడీ ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించేలా చర్యలు చేపట్టాలని కోరారు పాలకమండలి సభ్యురాలు గడ్డం సీతా రంజిత్‌రెడ్డి. మంగళవారం అన్నమయ్య భవనంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఈవో ఏవీ ధర్మారెడ్డిని కోరానని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ప్రతిరోజూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వచ్చే పాలకమండలి సమావేశం కన్నా ముందే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారన్నారు. టీటీడీ నిర్ణయం సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీత.. ఆమె టీటీడీప పాలకమండలి సభ్యురాలిగా అవకాశం దక్కింది. నాలుగు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడిగా చెన్నైకు చెందిన ఏజే శేఖర్‌రెడ్డిని నియమిస్తూ టీటీడీ డిప్యూటీ ఈవో జనరల్ గుణభూషణ్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అందజేశారు. అలాగే ఉత్తర భారతదేశంలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయాలు, ఆస్తుల అడ్వయిజరీ కమిటీ అధ్యక్షురాలిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నియమిస్తూ టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి (జనరల్) ఉత్తర్వులు జారీ చేశారు. న్యూఢిల్లీ, రుషికేశ్, కరుక్షేత్ర, వారణాశిలలోని దేవాలయాలు, ఆస్తులకు సంబంధించిన సహాయ, సలహాలు తదితరాలను టీటీడీకి ఆమె అందించనున్నారు.
కళంకారిని రాష్ట్రకళగా ప్రకటించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పిస్తానన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ఎస్వీ సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సంప్రదాయ ఆలయ శిల్పకళలు –అనుబంధ అంశాలపై మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. శిల్పకళాశాలలో కళంకారి రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సును నాలుగేళ్ల డిప్లొమా కోర్సుగా మార్చేందుకు బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైందని, కళల్లో శిల్పకళకు గొప్ప స్థానం ఉందని చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే ఆలయాలు, ప్రార్థనా మందిరాల నుంచి ఈ కళ ప్రారంభమైందన్నారు . ప్రపంచంలోని ప్రతి దేశ చరిత్రకు శిల్పకళ ఆధారభూతమైందని వివరించారు.
శిల్పకళ విద్యార్థుల నైపుణ్యం గొప్పదన్నారు. 17 సంవత్సరాల క్రితం ఈ కళాశాల పరిస్థితి చూసి సామూహిక మార్పులు చేశానన్నారు. ఈ కళాశాల విద్యార్థులతో అర అడుగు, ఒక అడుగు మేర శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమలు తయారు చేయించాలని గతంలో భావించానని చెప్పారు. స్వామివారు తనకు మళ్లీ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి విగ్రహాలు ప్రతి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా స్వామివారు తమతోనే ఉన్నారన్న భావన భక్తులకు కలుగుతుందని తెలిపారు. మూడు రోజుల వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని, శిల్పకళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
గతంలో ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి హయాంలోనే కళాశాలకు సొంత భవనం ఏర్పాటైందని చెప్పారు జేఈవో సదా భార్గవి. వర్క్‌షాపులో పనిచేస్తున్న శిల్పులకు ధరలు పెంచారని చెప్పారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని కరుణాకర రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ప్రకటించారని తెలియజేశారు. అదేబాటలోనే ప్రస్తుతం పయనిస్తూ కళాశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి విద్యార్థులకు శిల్పకళలోని మెళకువలపై అవగాహన కల్పించామని తెలిపారు. కళాశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 815 మంది విద్యార్థులను శిల్పులుగా తయారు చేసినట్టు తెలియజేశారు.
కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిల్పకళాప్రదర్శనను ఛైర్మన్ ప్రారంభించారు. ఇందులో ఆలయ నిర్మాణకళ, శిలా విగ్రహాలు, సుధా(సిమెంటు) విగ్రహాలు, కొయ్య విగ్రహాలు, లోహ విగ్రహాలు, సంప్రదాయ చిత్రకళ, సంప్రదాయ కళంకారి కళ, హస్తకళా ప్రదర్శనలు ఉన్నాయి. కుమారి పి.సాయిదేవిక నిరుపయోగమైన వస్తువులతో తయారుచేసిన వివిధ కళాకృతుల స్టాల్‌ను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. గాజుసీసాలు, మట్టికుండలు, జ్యూట్‌తో తయారుచేసిన గృహాలంకరణకు ఉపయోగపడే అనేక కళాకృతులు ఈ స్టాల్‌లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa