జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలో శిబిరాల నిర్వహణ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వైద్య శిబిరాలు జరుగుతాయని.. శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంచుతాం. రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని.. ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు పాల్గొంటారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి విడదల రజిని. ఈ నెల 15 నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ సేవల వివరాలు, అనుబంధ ఆసుపత్రుల జాబితాతో కూడిన కిట్‌లు అందజేస్తారని మంత్రి చెప్పారు. ఇంటిలో ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి, స్థానిక ఏఎన్‌ఎంలకు తెలియజేస్తారన్నారు. మరుసటి రోజు నుంచి ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేస్తారన్నారు. శిబిరాల నిర్వహణ సమయానికి వారి హెల్త్ రిపోర్ట్ సిద్ధం చేస్తారని.. ఈ నెల 8న శిబిరాల నిర్వహణ తేదీలను ఎంపీడీవోలు విడుదల చేస్తారన్నారు.
ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారన్నారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌వోలు) సందర్శిస్తారన్నారు.
ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు.
నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అమలులో ఆయా శాఖల మధ్య సమన్వయం అవసరమని సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహణ సమయంలో సాధారణ వాటితోపాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువులేని పిల్లలు, క్షయ, కుష్ఠు వ్యాధులు కలిగిన వారు ఉంటే.. ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa