ఢిల్లీలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జీ20 కూటమి శిఖరాగ్ర సదస్సు కోసం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ భారత్‌కు చేరుకున్నారు. సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ సహా ఇతర సీనియర్ దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. వారి గౌరవార్థం ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను సునాక్ తిలకించారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శనను బ్రిటన్ ప్రధాని ప్రశంసించారు. ఇక, భారత్‌కు బయలుదేరే ముందు రిషి సునాక్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని, తనని ‘భారత్‌కు అల్లుడు’గా వ్యవహరిస్తుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆప్యాయతతోనే తనను అల్లుడిగా పిలుస్తున్నట్టు ఆశిస్తున్నానని సునాక్ అన్నారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్ అన్నారు.
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నట్టు బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సునాక్ విమర్శలు గుప్పించారు. జీ20 వేదికపై పుతిన్ మరోసారి ముఖం చాటేశారని, స్వయంగా తనకు తానే దౌత్య బహిష్కరణ రూపశిల్పిగా మలుచుకున్నారని విమర్శించారు. అధ్యక్ష భవనంలో ఉంటూ విమర్శలు పట్టించుకోకుండా వాస్తవికతకు దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో మిగిలిన జీ20 సభ్యదేశాలు ఆయన పతనానికి కలిసి పని చేస్తామని చాటిచెబుతాయన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడిగా యూకే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. దీన్ని తిప్పికొట్టడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యానించారు. పుతిన్ ఆక్రమణలను అంతం చేయడానికి భారత్ తన పరపతిని ఉపయోగించాలని మోదీతో సహా అందరినీ కోరతామని ఆయన పేర్కొన్నారు. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై ఇప్పటి వరకూ 12 రౌండ్ల ద్వైపాక్షిక చర్చలు పూర్తయ్యాయి. కాగా, ఈ ఒప్పందంలో భాగంగా తమ ఇమ్మిగ్రేషన్ విధానంలో ఎటువంటి మార్పులు ఉండవని డౌనింగ్ స్ట్రీట్ పునరుద్ఘాటించింది. అయితే వాణిజ్య చర్చల్లో భాగంగా స్వల్పకాలిక వ్యాపార వీసాలు చర్చకు రానున్నాయి. మరోవైపు, జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అర్జెంటినా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్ అజాలీ అసౌమని, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జివా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఢిల్లీకి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa