అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడి ఆలయానికి ప్రత్యేకత ఉంది. గర్భ గుడిలో ఈ వినాయకుడు నడుము పైభాగం వరకు మాత్రమే దర్శనమిస్తాడు. వినాయకుడి తొండం భూమిలోకి చొచ్చుకుపోయినట్లుగా ఉంటుంది. ఆ తొండం.. ఆలయం పక్కనే ఉన్న చెరువు వరకూ విస్తరించి ఉంటుందని భక్తులు చెబుతున్నారు. గర్భగుడిలోకి స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంటుంది. చెరువులోని నీరు ఈ తొండం ద్వారానే గర్భ గుడిలోకి వస్తుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ నీటిని స్వామి వారి కైంకర్యాలకు వినియోగిస్తామని తెలిపారు. రెండో కాణిపాకంగా ప్రసిద్ధి చెందిన ఈ వినాయక ఆలయం గర్భ గుడిలో నీటి మిస్టరీని చేధించేందుకు గతంలో పలువురు పరిశోధనలు కూడా చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ఆలయం గర్భ గుడిలోకి నీరు ప్రవేశించింది. చుట్టూ నీరు చేరటంతో వినాయకుడు సగం వరకూ మాత్రమే దర్శనమిస్తున్నాడు. ఆలయ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తోడేసి స్వామి వారికి కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నీటిని తోడేస్తున్నారు. గతంలో ఆలయం చెంతనే పెద్ద చెరువు ఉండేదని, కాలక్రమంలో అది కనుమరుగైందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆలయంలోకి ఈ నీరంతా ఆ చెరువు నుంచే వస్తోందని అంటున్నారు. వర్షాలు తగ్గిపోతే ఆ నీరు కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. అయితే, గర్భాలయంలోకి నీరు చేరడం శుభశూచకమే అంటున్నారు అక్కడి పూజారులు.
చోడవరంలో విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలశారని పండితులు చెబుతున్నారు. సుమారు 200 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి స్వామి వారిని ‘కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు’ అని పిలుస్తారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసులు రెండో కాణిపాకంగా పిలుస్తారు. స్వామి వారి తొండం.. గర్భగుడిలోకి ఊట నీరు రావడం మిస్టరీని చేధించడానికి గతంలో కొంత మంది తవ్వకాలు కూడా జరిపారని స్థానికులు చెబుతున్నారు. స్వామి వారి తొండం పెద్దచెరువు వరకూ విస్తరించి ఉందని.. అలాగే ఏటా పెరుగుతూ ఉంటుందని వారంటున్నారు.