రాజకీయ కక్ష సాధింపునకు అంతం లేదా... అవధులు లేవా? దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం నిరంతరం తపించిన, ఎంతో చేసిన వ్యక్తికి ఇంత అన్యాయమా? కక్షసాధింపు చర్యలకు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడకపోవడమే దీనికి కారణమా? అందరికంటే ఎంతో ముందుగానే మన ప్రజలకు అవకాశాలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించడమే ఆయన చేసిన నేరమా? ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభివృద్ధిని నిరంతరాయంగా కాంక్షిస్తూ, హృదయాంతరాళాల్లో నింపుకున్న మా నాన్నను చూస్తూ నేను పెరిగాను. ఆయన ఏ రోజూ విశ్రాంతిని ఎరుగరు. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఆయన నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ రాజకీయాలను హుందాగా, నిజాయితీగా చేశారు. ఆయన సేవ ద్వారా లబ్ధి పొందిన వారి నుంచి అందే ప్రేమ, గౌరవాల నుంచి ఆయన పొందే అత్యున్నత ప్రేరణను నేను గమనించాను. ఈ రోజును... మా నాన్నను అన్యాయంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన రోజును... విద్రోహం దినంగా భావిస్తున్నా. మా నాన్న గొప్ప యోధుడు. నేను ఆయనకు వారసుడిని. రాష్ట్రం కోసం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అంచంచలమైన సంకల్పంతో, తిరుగులేని శక్తితో మేం పునరంకింతమవుతాం. ఈ పోరాటంలో నాతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.