విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విమ్స్‌కు 68 డాక్టర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 25 మంది పని చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 43 పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆస్పత్రికి భారీగా రోగులు వస్తుండడంతో ఉన్న వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 21న విమ్స్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏపీ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు చెందిన అధికారులు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించ నున్నారు. న్యూరో సర్జన్ పోస్టులు మూడు, న్యూరాలజీ-2, సర్జికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ-1, మెడికల్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ-2, సర్జికల్ అంకా లజీ-2, మెడికల్ అంకాలజీ-2, ప్లాస్టిక్ సర్జరీ-2, ఎండోక్రైనాలజీ-2, కార్డియాలజీ-3, పీడియాట్రిక్స్-2, ఎమర్జెన్సీ మెడిసిన్-4, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ (మెడికల్)-2, పల్మనాలజీ3, జనరల్ మెడిసిన్-3, అనస్థీషియా-8, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్/పాథాలజీ-1, ఒక ఆర్థోపెడిక్ వైద్యుడి పోస్టును భర్తీ చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు రూ.1.6 లక్షలు, జనరల్ స్పెషాలిటీ వైద్యులకు రూ.92 వేలు చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుసుకోవాలని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 25 మంది వైద్యులతో ప్రతిరోజూ 700 మందికి ఓపీ సేవలు అందిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆయా విభాగాల్లో రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.