ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే.. అడ్డంగా దొరికిపోయి బుకాయింపులా: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 08:36 PM

చంద్రబాబు గత 45 ఏళ్ల నుంచి దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నారన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లోకి విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారని.. ఆయన దొంగతనాల్లో వీరంతా వాటాదారులే అన్నారు. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ప్రశ్నించరు.. అనుకూల మీడియా నిజాలను చూపించరన్నారు. అనుకూల మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదని.. నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారన్నారు.


స్కిల్ కేసులో లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారన్నారు. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని.. ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని.. సీమెన్స్ కంపెనీ తమకు సంబంధం లేదని చెప్పిందన్నారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని.. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారని ధ్వజమెత్తారు. డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చిందని.. ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారన్నారు.


అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారని.. అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు. కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ప్రశ్నించడం లేదని.. వాళ్ల అనుకూల మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదన్నారు. చంద్రబాబు పీఏకు ఐటీ నోటీసులు ఇచ్చిందని.. రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలని.. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకరు.. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.


వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోందన్నారు. ప్రస్తుతం అందజేసే సాయంతో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేశామన్నారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందారని.. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.


రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలను గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు సీఎం. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని.. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామన్నారు. నాన్‌ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని.. కేబినెట్‌లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామని.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమన్నారు.


గత ప్రభుత్వం కాపులకు ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదని.. చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారన్నారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కాపుల్ని చంద్రబాబు మోసం చేశారని.. గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసిందన్నారు. తాను మాత్రం సాధ్యమైనవే చెబుతానని.. చంద్రబాబులా మోసం చేయడం తెలియదన్నారు. ప్రజలంతా ఒక్కటే ఆలోచన చేయాలి.. ఈ బిడ్డ హయాంలో మంచి జరిగిందా లేదా చూడాలన్నారు. 'మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి.. మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం' అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com