టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్‌డెవలెప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఏపీలో టీడీపీ కేడర్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. బాబుతో నేను అంటూ ఓ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ప్రెస్‌నోట్ వైరల్ అయ్యింది. ఆ నోట్‌లో టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నేతలపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా హెచ్చరించినట్లు ఉంది. అయితే ఈ నోట్ ఫేక్ అంటూ అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.
'రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా వేలాదిమంది స్వచ్చందంగా పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలు చూసి ఓర్వలేక వైఎస్సార్ సిపి సోషల్ మీడియా విభాగం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. నా పేరుతో పార్టీ అనుబంధ విభాగాలను హెచ్చరిస్తూ ఒక ఫేక్ లెటర్ ను విడుదల చేసి ప్రజలను, పార్టీ కేడర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ప్రతి జిల్లాలో క్రియాశీలకంగా చంద్రబాబుగారికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతున్నాయి. కావున దయచేసి ఎవరూ ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాను' అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
అచ్చెన్నాయుడు పేరుతో వైరల్ అవుతున్న నోట్‌లో ' తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్ చేసిన విషయం మీకు విదితమే. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా “బాబుతో నేను” అనే రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు, వాటి కార్యవర్గాలు (రాష్ట్ర పార్లమెంట్, నియోజకవర్గం, మండలం,గ్రామ) క్రియాశీలకంగా వ్యవరించటం లేదు అనే ఫిర్యాదులు అందినవి. కేవలం అధ్యక్షులు, ఒకరిద్దరు మాత్రమే పాల్గొంటున్నారని నివేదికలు వస్తున్నాయి. కావున అనుబంధ విభాగాలకు చెందిన నాయకులందరు గమనించగలరు. ఈ ఆందోళన కార్యక్రమాలలో అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులందరు విధిగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని, క్రియాశీలకంగా లేని నాయకులపై చర్యలు తీసుకోబడును' అంటూ హెచ్చరించినట్లు వైరల్ అయ్యింది. దీంతో అచ్చెన్నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు.