పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలను నిర్వహించాలని ఆజ్ఞాపించారట. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవారికి కన్యామాసం (ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందుకే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిచెంది అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అధిక మాసం కావడంతో రెండుసార్లు ఉత్సవాలను నిర్వహిస్తారు.
బ్రహ్మాండ నాయుకుడి బ్రహోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం (సెప్టెంబరు 17) న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరగనుంది. సెప్టెంబరు 18 ధ్వజారోహణంతో ఉత్సవాలకు దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఈ నేపథ్యంలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం వెల్లడించారు.
బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దుచేసినట్టు ఆయన తెలిపారు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేశామని పేర్కొన్నారు. ఉచిత దర్శనాలకు సంబంధించి.. 24 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని ఈవో పునరుద్ఘాటించారు. ఒకేసారి 2 లక్షల మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. సెప్టెంబరు 18 రాత్రి నుంచి శ్రీవారికి వాహనసేవలు ఉంటాయని ఆయన అన్నారు. మరోవైపు, బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శనివారం డిఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టి.. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీని కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే మొదలుపెడుతుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా.. తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేశారు.
ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజున జరిగే గరుడ సేవకు విశేష ప్రాధాన్యత ఉంది. గరుడ సేవ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామి తిరుమాడ వీధులలో నిదానంగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెబుతారు.