చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌ను దేవాన్ష్ చదివినా.. అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడని నారా బ్రాహ్మణి అన్నారు. లోకేష్‌ను కూడా నేడో, రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారని.. తప్పుచేయని తాము ఎవరికీ భయపడమని అన్నారు. ‘మా వెనుక 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, టీడీపీ కుటుంబం ఉంది. మాలో పోరాట స్ఫూర్తి ఉంది. న్యాయ వ్యవస్థపై మాకు అపారమైన నమ్మకం ఉంది’ అని బ్రాహ్మణి అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శనివారం (సెప్టెంబర్ 16) సాయంత్రం రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం మీడియాతో నారా బ్రాహ్మణి మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ. భారతదేశానికి ఐటీని తెచ్చిన దార్శనికుడు. నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన అలాంటి నాయకుణ్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమం. ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా నేను చాలా బాధపడుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా, ఒక సాధారణ మహిళగా ఆయన అరెస్టును తీవ్రంగా గర్హిస్తున్నాను’ అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడికే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలే ఆలోచించాలని బ్రాహ్మణి అన్నారు. ‘చంద్రబాబు లాంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా? అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా?’ అని ఆమె ప్రశ్నించారు.
‘వచ్చే వారంలో చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు బయటకు రావాలి. ఏపీకి న్యాయం జరగాలి. ఇందు కోసం మా పోరాటం కొనసాగుతుంది’ అని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు నాయుడు కియా, జోహో లాంటి అనేక పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఆమె చెప్పారు. ‘చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోంది. అందుకే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు.. రాష్ట్ర ప్రజలు, తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు’ అని బ్రాహ్మణి అన్నారు ‘చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు ఐటీని తెచ్చి రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’ అని బ్రాహ్మణి ప్రశ్నించారు.
చంద్రబాబు పర్యటనలకు, లోకేష్ యువగళం పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోందని.. దీన్ని ఓర్చుకోలేక తమపై కక్ష సాధిస్తున్నారని బ్రాహ్మణి ఆరోపించారు. కక్ష సాధింపుతోనే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు గంజాయి, లిక్కర్ ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తోంది. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారు, ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని బ్రాహ్మణి అన్నారు.