భారతీయ లెజెండ్రీ పెయింటర్ అమృతా షేర్ గిల్ కుంచె నుంచి జాలువారిన కళాఖండం వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 1941లో 28 ఏళ్ల వయసులో మరణించిన సిక్కు-హంగేరియన్ చిత్రకారిణి అమృతా షేర్-గిల్ కాన్వాస్‌పై గీసిన అందమైన ఆయిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ శనివారం రాత్రి జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో రూ. 61.8 కోట్లకు ($7.4 మిలియన్లు) దీనిని దక్కించుకున్నారు. దీంతో ప్రపంచంలో అత్యధిక ధరకు అమ్ముడైన భారతీయ కళాఖండంగా రికార్డు నెలకొల్పింది. పది రోజుల కిందట ఆధునిక వాది భారతీయ చిత్రకారుడు సయ్యద్ హైదర్ రజా 'గెస్టేషన్' అనే పెయింటింగ్ పుండోల్ ఆంక్షన్ హౌస్‌లో రూ. 51.7 కోట్లు పలికింది. ఆ రికార్డును అమృతా షేర్ గిల్ పెయింటింగ్ అధిగమించిగా. గెస్టెషన్ రెండో స్థానంలోనూ దీని తర్వాత అబ్‌స్ట్రాక్షనిస్ట్ వాసుదేయో ఎస్ గైటోండే పెయింటింగ్ రూ. 32 కోట్లతో 3వ స్థానంలో ఉంది.
దేశంలో ఏకైక మహిళా పెయింటర్‌గా గుర్తింపు పొందిన అమృతా షేర్ గిల్.. 1938లో గీసిన ‘పల్లెటూరి బృందం’ 2006 మార్చిలో రూ.6.9 కోట్లకు వేలంలో అమ్ముడై.. అప్పట్లో రికార్డు సృష్టించింది. అమృతా షేర్ గిల్ తండ్రి భారతీయుడు కాగా.. తల్లి హాంగేరీకి చెందిన మహిళ. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో 1913లో జన్మించిన అమృతా షేర్ గిల్.. ఐరోపా, ఇండియాలో ఉన్నారు. ఎలైట్ ఎకోల్ డెస్ బ్యూక్స్ ఆర్ట్స్‌లో చదువుకున్న షేర్ గిల్.. అక్కడ పెయింటింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి ఆసియన్‌గా నిలిచింది. విద్యార్థి రోజులలో ఆమె తన సోదరిని మోడల్‌గా ఉపయోగించికుని నగ్న చిత్రాలను చిత్రీకరించారు. తన 25వ ఏట భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ఐరోపా పికాసో, మాటిస్సే, బ్రాక్, సహా అనేక ఇతర వ్యక్తులకు చెందినది. భారతదేశం నాకు మాత్రమే చెందుతుంది’ అని ఆమె 1938లో గర్వంగా చెప్పుకున్నారు.
1934లో తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో.. భారత్‌కు మకాం మార్చడానికి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. ‘ఐరోపా మా సుదీర్ఘ బస నాకు భారతదేశాన్ని కనుగొనడంలో సహాయపడింది… అజంతా నుంచి ఒక ఫ్రెస్కో లేదా మ్యూసీ గుయిమెట్‌లోని ఒక చిన్న శిల్పం పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనది!’ అని రాశారు. ప్రపంచ రికార్డును నెలకొల్పిన పెయింటింగ్ ది స్టోరీ టెల్లర్ (1937), పహారీ, పారశీకుల విలక్షణను ప్రతిబింబిస్తుంది. ఆమె చిత్రీకరించిన వాటిలో ఎన్ ప్లీన్ ఎయిర్ కూడా ముఖ్యమైనది. గోవుల మందతో ఆరుబయట విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీల సమూహాంలో ఒకరు పాన్ తింటుంటే, మరొకరు చేతితో విసనకర్ర ఊపుతూ, మరికొందరు మాట్లాడుతుంటారు. షేర్-గిల్ పెయింటింగ్‌లు మహిళలే ప్రధానంగా ఉంటాయి. ఆమె పెయింట్ రికార్డు ధర పలకడం ఆమె అపార కళా నైపుణ్యానికి.. శాశ్వతమైన వారసత్వానికి నిదర్శనమని సాఫ్రోనార్ట్ సీఈఓ దినేష్ వజిరాణి అన్నారు. షేర్-గిల్‌తో పాటు కేరళలో జన్మించిన కళాకారుడు రామచంద్రన్, కేకే హెబ్బార్, మద్రాస్ ఆర్ట్ మూవ్‌మెంట్ మార్గదర్శకులలో ఒకరైన నందగోపాల్ సృష్టించిన కళాఖండాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.