ఇళ్లలో టాయ్‌లెట్ సౌకర్యం లేకపోవడంతో ముగ్గురు మహిళలు బహిర్బూమికి వెళ్తున్న సమయంలో వారి చుట్టూ భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఆ ముగ్గురూ శిథిలాల్లో కూరుకుపోయి సజీవసమాధి అయ్యారు. విషాదకర ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మహిళల్లో ఒకరు మొదట లోపలికి కూరుకుపోతుండగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరూ లోనికి పడిపోయారు. గోండుడిహ్ కొలీరీలోని దోబి కుల్హికి చెందిన పర్ల దేవి, తంధీ దేవి, మండవ దేవిలు కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
గోండుడిహ్ ఖాస్ కుసుంద కొలీరీలో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) గనుల తవ్వకాలను నిర్వహిస్తోంది. ధన్‌బాద్‌లోని గోండుడిహ్ కొలిరీ వద్ద పర్వత సమీపంలో భారీ శబ్దంతో కొండచరియలు విరిగిపడటంతో మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు, బీసీసీఎల్ గనుల రెస్క్యూ సిబ్బందికి తక్షణమే సమాచారం అందించినా కొన్ని గంటల తర్వాత చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. బీసీసీఎల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు చేశారు. ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల నుంచి ప్రజలకు సరైన పునరావాసం కల్పించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని దుయ్యబడుతున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతదేహాలను వెలికితీసిన తర్వాత కుటుంబ సభ్యులకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని ధన్‌బాద్ సర్కిల్ అధికారి ప్రశాంత్ కుమార్ లాయక్ తెలిపారు.