ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్లు సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేశారు. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగానే తనకు సమన్లు జారీచేశారని ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
షాహెబ్‌గంజ్ జిల్లాలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీల్యాండరింగ్ కేసు నమోదుచేసింది. ఈ కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు విచారణకు రావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ, ఆగస్టు 14, ఆగస్టు 24 తేదీల్లో హేమంత్ సోరెన్ డుమ్మా కొట్టారు. మళ్లీ సెప్టెంబర్ 9న రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ సమన్లు ఇచ్చినా.. జీ20 సదస్సు నేపథ్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి విందు కోసం ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.
తాజాగా, సెప్టెంబరు 23న రావాలని ఈడీ నాలుగో సారి సమన్లు జారీ చేయడంతో హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంది పెండింగ్ కేసని, రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా ఈడీ పదే పదే సమస్లు జారీచేస్తోందని ఆరోపించారు. సమన్లు అవమానకరం.. చట్టవిరుద్ధం, అన్యాయం కాకుండా.. నేరుగా తన పేరుతో కాకుండా జార్ఖండ్ ముఖ్యమంత్రి అని పేర్కొని తన పదవిని కూడా బలహీనపరిచాయని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని పార్టీలను లక్ష్యంగా చేసుకోవడంతో ఈడీ వంటి సంస్థలను అధికార పార్టీ ప్రయోగిస్తోందని ఆరోపించారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు నిరాశ తప్పలేదు. హైకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ఆయన ఇప్పుడు ఝార్ఖండ్ హైకోర్టుకు వెళ్లనున్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను గతేడాది నవంబరులో ఈడీ 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే