ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి కారణంగా 42 ఏళ్లుగా మూతపడిన రైల్వే స్టేషన్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 07:50 PM

సామాన్యులకు అత్యంత అందుబాటు ధరల్లో దగ్గరి ప్రాంతాలతో పాటు సుదూర ప్రయాణాలు చేసేందుకు భారతీయ రైల్వేలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సుమారు 170 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న ఇండియన్ రైల్వేస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన, వింతైన విషయాలు అప్పుడప్పుడూ మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక రైల్వే స్టేషన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్‌లో గత 42 ఏళ్లుగా ఒక్క రైలు కూడా ఆగడం లేదు. ప్రయాణికులు ఎవరూ ఆ రైల్వే స్టేషన్‌కు రావడం లేదు. అప్పటి నుంచి ఆ రైల్వే స్టేషన్ మూతపడి ఉండటంతో రైల్వే సిబ్బందిని కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అదే పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉన్న బెగన్‌కోడోర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్‌ను 1960 లో ప్రారంభించగా.. ఏడేళ్లకు అంటే 1967 లో మూతపడింది.


ఈ బెగన్‌కోడోర్ రైల్వే స్టేషన్‌ను 1960 లో సంతాల్ రాణి శ్రీమతి లచన్ కుమారి సహకారంతో ప్రారంభించారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు అక్కడ బాగానే రైల్వే సర్వీసులు నడిచాయి. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే తొలిసారి 1967 లో ఓ రైల్వే ఉద్యోగి ఒక ఆడ దెయ్యాన్ని చూసినట్లు చెప్పాడు. అయితే ఆ ఉద్యోగి చెప్పిన మాటలను ఇతర సిబ్బంది, ప్రయాణికులు, ఉద్యోగులు పట్టించుకోలేదు. ఆ తర్వాత మరో సంఘటన చోటు చేసుకోవడంతో అక్కడి వారిలో తెలియని భయం నెలకొంది. దీంతో ఆ ఉద్యోగి చెప్పిన మాటలను అక్కడ ఉన్నవారు నమ్మడం ప్రారంభించారు. ఎందుకంటే బేగన్‌కోడోర్ స్టేషన్ మాస్టర్.. అతని కుటుంబ సభ్యులు రైల్వే క్వార్టర్స్‌లో శవాలై కనిపించారు. దీంతో ఆ ఘటన వెనక ఓ మహిళా దెయ్యం ఉందని అక్కడి వారు నమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ దెయ్యం గురించి కథలు కథలుగా స్థానికులు విన్నారు.


సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ స్టేషన్ గుండా వెళ్లే రైలు వెంట ఆ మహిళా దెయ్యం పరిగెత్తుతుందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ రైలు కంటే వేగంగా ఆ దెయ్యం పరిగెత్తుతుందని చెప్పారు. చాలాసార్లు ఆ దెయ్యం రైలు పట్టాలపై డ్యాన్సులు కూడా చేసిందని కొందరు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకోవడంతో ఆ బెగన్‌కోడోర్ రైల్వే స్టేషన్‌ను హాంటెడ్‌గా పిలిచేవారు. ఈ రైల్వే స్టేషన్‌లో దెయ్యం ఉందన్న భయాందోళనలతో ప్రయాణికులు అక్కడికి రావడమే మానేశారు. దీంతో రైల్వే ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్లడానికే భయపడటం ప్రారంభించారు. ఉద్యోగం లేకున్నా పర్లేదు కానీ ఆ రైల్వే స్టేషన్‌లో పని చేయం బాబోయ్ అంటూ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.


ప్రయాణికులు కూడా క్రమంగా రావడం తగ్గిపోవడంతో ఆ బెగన్‌కోడోర్ స్టేషన్‌లో రైళ్లు ఆపడం మానేశారు. ఆ స్టేషన్ వద్దకు రైలు రాగానే లోకో పైలట్ రైలు వేగాన్ని పెంచుతాడని చెబుతున్నారు. ఆ స్టేషన్ వద్దకు రాగానే ప్రయాణికులు భయపడి కిటికీలు, తలుపులు మూసేసేవారని పేర్కొన్నారు. అయితే 2009 లో అక్కడి గ్రామస్తుల కోరికతో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడివారు ఎవరూ దెయ్యం చూడకపోయినా ఇప్పటికీ సాయంత్రం అయితే ఆ స్టేషన్ వద్ద నిర్మానుష్యంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో రోజూ దాదాపు 10 రైళ్లు ఆగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com