మీకు ఎస్సైతో భద్రత కావాలా.. శిక్షణ పొందిన పోలీస్ జాగిలం.. వైర్‌లెస్ సెట్‌తో పోలీసులు మీ వెంటే ఉండాలా? అంతేకాదు, ఏకంగా పోలీసు స్టేషన్‌ను అద్దెకు తీసుకుంటారా? అయితే రోజుకు కేవలం రూ.34,000 ఖర్చుచేస్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అవునే ఇదేదో విదేశాల్లో కాదు. మనదేశంలోని అదీ దక్షిణాది రాష్ట్రం కేరళలోనే ఈ పథకం అమలు చేస్తున్నారు. వాస్తవానికి ఇది పాత పథకమే.. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ఈ పథకాన్ని కొత్త రేట్లతో మళ్లీ కేరళ ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హం.
ఇటీవల కేరళ ప్రభుత్వ విడుదల చేసిన ధరల పట్టిక ప్రకారం.. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారిని నియమించుకుంటే రోజుకు రూ. 3,035 నుంచి రూ. 3,340 వరకు ఖర్చవుతుంది. దీని కంటే తక్కువ మొత్తంలో కావాలంటే సివిల్ పోలీస్ (స్నేహపూర్వక పొరుగు కానిస్టేబుల్) సేవలకు రూ. 610, పోలీసు జాగిలం అయితే రూ. 7,280, వైర్‌లెస్ పరికరాలను రోజువారీ అద్దెకు రూ. 12,130 తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ అద్దెకు కావాలంటే రూ.12,000 చెల్లిస్తే సరి.
పోలీసు స్టేషన్, వైర్‌లెస్ పరికరాలకు ఇంచుమించు ఒకే రకమైన అద్దె, పోలీసు అధికారి కంటే పోలీసు కుక్కకు ఎందుకు ఎక్కువ మొత్తం ఛార్జ్ చేస్తారనేది ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పలేదు. కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం.. ప్రైవేట్ పార్టీలు, వినోదాలు, సినిమా షూటింగ్‌లకు పోలీసులను అద్దెకు తీసుకోవచ్చు. అయితే, దీనిపై కొంతమంది ప్రభుత్వ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. సినిమా నిర్మాణ సంస్థలు, ప్రైవేట్ పార్టీలు జరుపుకునే సంపన్నులకు వనరులు సమృద్ధిగా ఉంటాయని, పోలీసులను, వారి పరికరాలను అద్దెకు తీసుకోవలసిన అవసరం ఏముంటుందని అంటున్నారు. వాస్తవాన్ని గుర్తించడంలో విఫలమవడమే కాకుండా.. ప్రభుత్వ సిబ్బందిని, ఆస్తిని అద్దెకు ఇవ్వడం కూడా నైతికతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారు. వైర్‌లెస్ సెట్‌లు, తుపాకీలతో పోలీసులను నియమించుకోవడం భద్రతా సమస్యలను జటిలం చేస్తుంది.
సినీ నిర్మాణ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో లేదా సున్నిత ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుమతి కోసం మాత్రమే పోలీసులపై ఆధారపడతారని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘పోలీసులకు సంబంధించిన అన్ని ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే పరిశ్రమలోనే అందుబాటులో ఉన్నాయి’ అని మాలీవుడ్ నిర్మాత రోషన్ చిత్తూర్ తెలిపారు. గతేడాది కన్నూర్ జిల్లా పనూరులో ఓ వ్యాపారి కుమార్తె వివాహ వేడుకలో నలుగురు పోలీసు అధికారులను భద్రత కోసం నియమించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ‘ఈ అంశాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది.. ప్రయివేట్ వ్యక్తుల ఆడంబరాలు, ప్రదర్శనలకు పోలీసులు లేదా ఆ విభాగానికి చెందిన ఇతర వనరులను ఉపయోగించకూడదు’ అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఆర్ బిజు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొన్నారని, వాటిని శ్రద్ధగా పాటించాలని ఆయన అన్నారు. ఇవి పాటించని పక్షంలో కేరళ పోలీస్ స్టేషన్‌లో వివాహం చేసుకోవచ్చని, అతిథులపై ఇన్‌స్పెక్టర్లు, పోలీసు డాగ్‌లు నిఘా ఉంచుతాయన్నారు.