టీవీ యాంకర్లను ఉద్యోగంలోకి తీసుకునేటపుడు ఎన్నో రకాల టెస్ట్‌లు నిర్వహిస్తారు. కేవలం సబ్జెక్ట్ పరంగానే కాకుండా వారి ముఖ కవలికలు, వారు వార్తలు చదివే విధానం, ఎలాంటి రకమైన వార్తలను ఏ రకంగా చదువుతున్నారు అనే చిన్న చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని వారికి ఉద్యోగాలను ఇస్తారు. ఎందుకంటే టీవీలపై వారు ఉండే విధానమే ఆ ఛానల్‌కు పేరు తెస్తుంది. అయితే తాజాగా ఓ యాంకర్ చేసిన పనికి ఆమెతో పాటు సదరు టీవీ ఛానల్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఓ విషాదకరమైన వార్త గురించి చెప్తూ లైవ్‌లో ఉండగానే ఓ మహిళ ఠక్కున నవ్వింది. దీంతో అప్రమత్తమైన టెక్నికల్ సిబ్బంది.. వెంటనే లైవ్‌ను నిలిపివేశారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.
బిహార్‌కు చెందిన ఓ స్థానిక న్యూస్ ఛానల్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగానే భాగమతి నదికి వరదలు రావడం, వాటి కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి ఆ యాంకర్ వివరిస్తూ ఉంది. అంతలోనే ఏమైందో తెలియదు ఆ యాంకర్ ఒక్కసారిగా నవ్వింది. స్టూడియోలో ఉన్న యాంకర్.. బాధాకరమైన సంఘటన గురించి వివరిస్తూ నవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఆమె పలికే పదాల్లో భాగంగా ఓ పదాన్ని తప్పుగా పలకడంతోనే ఆమె నవ్వి వెంటనే సరి చేసుకుని వార్త చదివింది. జరిగిన ఘటనపై ఆమె వెంటనే లైవ్‌లోనే క్షమాపణలు కూడా చెప్పింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సదరు టీవీ ఛానెల్‌పై, ఆ యాంకర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి బాధాకరమైన వార్త చదువుతుంటే నవ్వు ఎలా వచ్చింది అంటూ వాయించేస్తున్నారు. ఓ పక్క జనాలు చనిపోతూ ఉంటే అదేదో కామెడీ షో లాగా యాంకర్ నవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి యాంకర్‌ను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేయాలని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు.. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సుమారు 30 మంది పిల్లలతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది పిల్లలు గల్లంతయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పడవ బోల్తా పడిన విషయం తెలుసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.